Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ముస్లిం మతస్తుడివంటూ, ఉద్యోగం ఇవ్వని కార్పొరేట్ సంస్థ

ఓ వైపు మత వివక్షను చూపేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రధాని మోదీ చెబుతున్నా, ఇండియాలో వివక్ష పూర్తిగా రూపుమాసిపోలేదనడానికి తాజా ఉదాహరణ ఇది. వజ్రాలను ఎగుమతి చేసే ఓ కార్పొరేట్ సంస్థ ముస్లిం మతస్తుడివంటూ, ఓ నిరుద్యోగికి ఉద్యోగం ఇవ్వలేమని స్పష్టం చేసింది. వివరాల్లోకి వెళితే, ముంబై కేంద్రంగా పనిచేస్తున్న హరికృష్ణ ఎక్స్పోర్ట్ కంపెనీలో ఉద్యోగం కోసం ఎంబీఏ విద్యను అభ్యసించిన జేషన్ అలీ ఖాన్ దరఖాస్తు చేసుకున్నాడు. అతనికి కంపెనీ నుంచి ఓ మెయిల్ వచ్చింది. 'నీవు ముస్లిం అయినందువల్ల ఉద్యోగాన్నిఇవ్వలేకపోతున్నా'మన్నది దాని సారాంశం. దీంతో అవాక్కయిన అలీ, ఉద్యోగానికి సరిపడే విద్యార్హతలు లేకపోతే ఆ విషయం చెప్పాలిగానీ, ఇదేంటని ప్రశ్నిస్తూ, మెయిల్ విషయాన్ని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశాడు. దీంతో వివాదం చెలరేగింది. అయితే, తాము ఎటువంటి వివక్షనూ చూపలేదని, అంతకు ముందే శిక్షణలో వున్న అభ్యర్థిని ఎంపిక చేశామని చెబుతున్న సదరు సంస్థ టైపింగ్ లో పొరపాటు కారణంగా అటువంటి మెయిల్ వెళ్లిందని చెబుతోంది.

More Telugu News